Saturday, February 28, 2015

ఎమి చేస్తున్నావు ఓ విశ్వాసి

ఎమి చేస్తున్నావు ఓ విశ్వాసి.. దేవుడు చూడట్లేదా ఓ విశ్వాసి

లూసిఫర్ వలె మనస్సులో అతిశయపడుచున్నావు.
నెబుకద్నెజరు వలె అతిశయముగా మాట్లాడుచున్నావు.
బెల్షస్సరు వలె అతిశయముతో ప్రవర్తించుచున్నావు.
ఉజ్జియా వలె అతిశయించి చెడిపోవుచున్నావు.
గెహజీ వలె అక్కర్లేని ధనము నిమిత్తము పరుగెడుచున్నావు.
ఆకాను వలె అన్యాయపు సిరిని దాచుకొనుచున్నావు.
యెజెబెలు వలె పరులసొత్తును దోచుకొనుచున్నావు.
యూదాఇస్కరియోతు వలె దేవునిసొమ్మునే దొంగిలించుచున్నావు.

సంసోను వలె దెలీలాతో స్నేహము చేస్తున్నావు.
దావీదు వలె పరస్త్రీవైపు మోహించుచున్నావు.
సొలొమోను వలె అనేకమంది స్త్రీలను కోరుకొనుచున్నావు.
అమ్నోను వలె పాపము చేయుటకు తపించుచున్నావు.
జెబదయి కుమారుల తల్లి వలె గొంతెమ్మ కోరికలు కోరుచున్నావు.
పేతురు వలె డాబులు చెప్పుకొనుచు బ్రతుకుచున్నావు.
మార్త వలె హడావిడిచేస్తూ ఉత్తమమైనది విడిచిపెట్టుచున్నావు.
నిమ్రోదు వలె జనము దృష్టిలో గొప్ప పేరుకోసం తాపత్రయపడుచున్నావు.

ఎమి చేస్తున్నావు ఓ విశ్వాసి.. దేవుడు చూడట్లేదా ఓ విశ్వాసి

ఆత్మఫలము-2

ప్రియ నేస్తమా... ప్రియ నేస్తమా...

  1.  ప్రేమ కలిగి యుండుటకు ప్రయాసపడుమా. 
  2. సంతోషము క్రీస్తు సన్నిధిలోనే దొరుకును సుమా. 
  3. సమాధానము అందరితో కలిగియుండుటకు ప్రయత్నించుమా. 
  4. దీర్ఘశాంతము నీ ఆత్మీయ జీవితపు కొలబద్దే సుమా. 
  5. దయాళుత్వము నీకు ఆభరణము గుర్తించుమా. 
  6. మంచితనము నీ సౌందర్యము తెలిసికొనుమా. 
  7. విశ్వాసము విడిచిపెట్టక గట్టిగా పట్టుకొనుమా. 
  8. సాత్వికము రహదారిగా చేసికొని పయనించుమా. 
  9. ఆశానిగ్రహము సంతుష్టి సహితమైన భక్తితోనే సాధ్యం సుమా. 

ఇవన్నీ యేసే ఇస్తాడని తెలిసికొనుమా.
యేసును నీ జీవితపు ప్రభువుగా ఒప్పుకొనుమా.
ప్రియ నేస్తమా... ప్రియ నేస్తమా...

Plz share your feedback in the form of comments so that I can try to write next article with much prayer.

Wednesday, February 25, 2015

ఆత్మ ఫలము

ఎవరు పంచుతారు నాకు శాశ్వతమైన ప్రేమను.

ఎవరు అందిస్తారు నాకు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషమును.

ఎవరు నింపుతారు నా హృదయము నిండా అనిర్వచనీయమైన సమాధానమును.

ఎవరు నేర్పగలరు నాకు దీర్ఘశాంతమును.

ఎవరు కలిగియున్నారు ఊహకందని దయాళుత్వమును.

ఎవరు మాదిరి చూపించగలరు నాకు మంచితనమును.

ఎవరు కొనసాగించగలరు నాలోని విశ్వాసమును.

ఎవరు బోధించగలరు నాకు సాత్వికమును.

ఎవరు పుట్టించగలరు నాలో ఆశానిగ్రహమును. 

అతడు ఎవరో మీకు తెలిస్తే ఇప్పుడే ప్రపంచానికి చాటి చెప్పండి.

Friday, February 20, 2015

ఆత్మ ఫలము: 1. ప్రేమ (ఆఖరి భాగము)

రెండవ భాగములో యేసుక్రీస్తు ప్రేమలోని 4 విషయములను ధ్యానించగలిగాము. అవేవనగా యేసుక్రీస్తు ప్రేమ అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; మరియు అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఈ ఆఖరి భాగములో ఆరు విషయములను తెలిసికొనెదము. 1 కొరింథీ 13:6-8 ప్రకారము

మొదటిగా, యేసుక్రీస్తు ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. చిన్న పిల్లలంటే తల్లితండ్రులకు చాలా ఇష్టం కదూ. కాని వారి ఎదైనా తప్పు చేస్తే తల్లితండ్రులు మౌనముగా కూర్చోలేరు కదూ. యేసుక్రీస్తు మనస్సు కూడా మనము త్రోవ తప్పిపోతే ఎంతో బాధపడుతుంది. కాపరి తప్పిపోయిన గొర్రెను మందలోకి చేర్చుటకు ఎంతగానో కష్టపడి వెదకి ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషించి దానిని మరల మందలో చేర్చినట్లు యేసుక్రీస్తు కూడా మనము తప్పిపోయినప్పుడు మనం ఎదుర్కొనబోయే దుస్థితిని గుర్తించి కన్నీటితో మనగురించి ఎదురుచూస్తూ మనం వచ్చినప్పుడు చెప్పనశక్యమైన సంతోషముతో మనల్ని తన అక్కున చేర్చుకొంటున్నారు. ఈ విషయం నేటి సమాజము ఎప్పుడు అర్థం చేసికొంటుంది?

రెండవదిగా, యేసుక్రీస్తు ప్రేమ అన్నిటికి తాళును లేక అన్నిటిని కప్పును. మనము చేసే విస్తార దోషములను యేసుప్రేమ కాక మరి యేదైనా ప్రేమ కప్పగలదా? ఆదాము హవ్వలు కేవలం దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వినకపోతే ఎంతో శిక్ష రాలేదా? మరి నేటి కాలములో విశ్వాసులమని పిలువబడే మనము దేవుని ఆజ్ఞలను ఎన్ని పాటిస్తున్నామో ఒక్కసారి ఆలోచించి చెప్పండి. అలాగైతే ఎంత శిక్షను మనము అనుభవించాలో కదా. కాని కృపామయుడైన యేసయ్య మనకు రావల్సిన పాపశిక్షను తాను శిలువలో భరించి తన రక్తముతో తుడవలేదా? ఇది గుర్తెరిగిన హృదయము ఆయనను స్తుతించకుండా మౌనముగా ఎలా ఉండగలదు?

మూడవదిగా, యేసుక్రీస్తు ప్రేమ అన్నిటిని నమ్మును. యేసుక్రీస్తు చెంతకు దుడుకు పేతురు వచ్చాడు. అనుమానపు తోమా వచ్చాడు. ఉరిమెడివారైన జెబదయి కుమారులు వచ్చారు. ధనాశ గలిగిన యూదా ఇస్కరియోతు వచ్చాడు. వీరి గురించి యేసుక్రీస్తుకు ముందుగానే తెలియదా? కాని వీరిని ఎలా నమ్మాడు? ఆయన వీరిని ప్రేమించాడు తత్ఫలితముగా వీరిని నమ్మాడు. మరి మనము కూడా యేసుక్రీస్తు చెంతకు వచ్చినప్పుడు చాల తీర్మానములు చేసికొనినప్పుడు ఆయన కూడా మనలను నమ్మి మన తీర్మానాలను బలపరచలేదా? కాని కాలక్రమములో ఆ తీర్మానాలను మనము ప్రక్కనబెట్టి మనకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఆయనకు (యూదా ఇస్కరియోతు లాగా) నమ్మకద్రోహము చేయట్లేదా. ఒక్కసారి ఆలోచిద్దామా ప్రియ నేస్తమా ఈ సమయములో...

నాల్గవదిగా, యేసుక్రీస్తు ప్రేమ అన్నిటిని నిరీక్షించును. తప్పిపోయిన తన కుమారుడు వచ్చేవరకు తండ్రి ఓపికతో ఎదురు చూచిన రీతిగా యేసుక్రీస్తు కూడా లోబడనొల్లని ప్రజలవైపు తన చేతులు చాపుచున్నాడు. వ్యవసాయకుడు విత్తనములు చల్లి పంటకొరకు కనిపెట్టుకొనినట్లుగా యేసుక్రీస్తుకూడా వాక్యమనే విత్తనములు చల్లి మనలో ఫలములకొరకు నిరీక్షిస్తున్నాడు. ఎంత వరకు ఆయన మనకొరకు నిరీక్షిస్తాడు? ఆయన రెండవ రాకడ లేక మన మరణము వరకు. ఎంతో అతృతతో ఎదురుచూస్తున్న యేసయ్యను తమ స్వరక్షకునిగా అంగీకరించకుండా ఎందుకు వాయిదాలు వేస్తారు. ఎంతకాలము ఆత్మ ఫలము ఫలించకుండా ఆయనకు కారుద్రాక్షలు మిగులుస్తారు? యోచించండి ప్లీజ్...

అయిదవదిగా, యేసుక్రీస్తు ప్రేమ అన్నిటిని ఓర్చును. ఆయనపై అన్యాయముగా అబద్దసాక్ష్యము పలికినప్పుడు ఆయన ఓర్చుకొనలేదా? ఒక నేరస్థునిగా అన్యాయపు తీర్పు తీర్చినప్పుడు ఓర్చుకొనలేదా? ముఖము మీద గ్రుద్ది, ఉమ్మివేసి మరియు వెంట్రుకలు పెరికినప్పుడు ఓర్చుకొనలేదా? 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఓర్చుకొనలేదా? సిలువపై ఘోరాతిఘోరముగా హింసించినప్పుడు ఓర్చుకొనలేదా? ఇంతటి అవమానమును నేటి ప్రేమలు ఎవైనా ఓర్చుకొనగలవంటారా?

చివరిగా, యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతకాలము ఉండును. నీవు పుట్టక మునుపే ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడు. నీవు తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఆయన ప్రేమించాడు. తల్లిగర్భములో నిన్ను రూపించి ఈ భూమి మీదకి తెచ్చి నీ పాదములకు రాయి తగులకుండా నీ అడుగు ఇరుకునబడకుండా అనగా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. నీవు మరణించిన తరువాత నీ ఆత్మను పరలోకము చేర్చుటకు ప్రేమతో ప్రయత్నిస్తున్నాడు. నీవు పుట్టిన దగ్గర నుండి మరణించేటంత వరకు ఎన్నో సార్లు ఆయనను బాధపెట్టి ఉంటావోకదా. ఇటువంటి బాధలు నేటి కాలపు ప్రేమలకు పెట్టి చూడండి. అవి బాధలు పెట్టే నిన్ను శాశ్వతకాలము ఓర్చుకుంటూ ప్రేమించగలవా. ఆలోచించండి. అశాశ్వతమైన ప్రేమలవైపు పరుగెడుతూ శాశ్వతమైన యేసుప్రేమను కాలదన్నుట న్యాయమా?

ప్రియ పాఠకా! మనము ఎవరము అలా ఉండవద్దు. యేసు ప్రేమను అర్థం చేసుకొన్నాము కదూ. ఈ చిన్ని ప్రార్థన చేద్దామా... ప్రేమ గల తండ్రి, దయ గల నాయనా, మీ పాదములకు స్తోత్రములు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమను అర్థము చేసికొనగలిగే అవకాశము మాకు ఇచ్చారు. మీకు స్తోత్రములు. యేసు మమ్మల్ని ప్రేమించిన రీతిగా మేము కూడా పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో మిమ్మల్ని మరియు మా పొరుగువారిని ప్రేమించే కృపను ఇవ్వమని బ్రతిమాలుకొనుచూ యేసుక్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రీ, ఆమేన్.

మీకు ఈ అర్టికల్ నచ్చినట్లయితే మీ జీవితానికి అన్వయించుకొనండి. ప్రార్థించండి. Share చేయండి.మీ అభిప్రాయాలను నాకు తప్పనిసరిగా తెలియజేయండి. చాలా ప్రోత్సాహకరముగా ఉంటుంది. D.Pradeep Kumar 9849555496

ఆత్మఫలము: 1. ప్రేమ (రెండవభాగము)

మొదటి భాగములో యేసుక్రీస్తు ప్రేమలోని 5 విషయములను ధ్యానించితిమి. అవేవనగా యేసుక్రీస్తు ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు మరియు ఉప్పొంగదు. ఈ రెండవ భాగములో మరో 4 విషయములను తెలిసికొనెదము. 1 కొరింథీ 13:5 ప్రకారము

మొదటిగా, యేసుక్రీస్తు ప్రేమ అమర్యాదగా నడువదు. ఆయన జీవించిన 33 1/2 సంవత్సరాల కాలములో ఎక్కడ కూడాను అమర్యాదగా ప్రవర్తించటం కనబడదు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనను స్థాపించగలడా అని ఆయన వేసిన ప్రశ్నకు నేటివరకును సమాధానము లేదు. ఇక ముందు కూడా సమాధానము రాదు. అత్యున్నతమైన ప్రేమ గలిగిన యేసుక్రీస్తే అంత మర్యాదగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయనను నమ్ముకున్నామని చెప్పుకొనే నేటి విశ్వాసులు ఎదుటివాని యెడల ఎందుకు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు?

రెండవదిగా, యేసుక్రీస్తు ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రియ నేస్తమా! ఒక్కసారి అలోచించండి...ఒకవేళ యేసుక్రీస్తు గనుక "ఈ పాపియైన వ్యక్తి కొరకు నా ప్రాణం నేను ఎందుకు పెట్టాలి. ఈ పని చేస్తే నాకు ఒరిగేదేమిటి?" అని తన ప్రయోజనము గురించి ఆలోచిస్తే ఈ మానవాళికి ఏమి జరుగుతుంది? ఒక్క ఆత్మ అయిన పరలోకం చేరుతుందా. 100% చేరనే చేరదు కదా. విచిత్రమైన విషయమేమనగా తన ప్రయోజనము ఎంత మాత్రమును ఆశించకుండా యేసుక్రీస్తు మనలను ప్రేమిస్తుంటే నేటి వ్యక్తులు యేసు క్రీస్తు దగ్గరకు వస్తే నాకు ప్రయోజనము ఎమిటి? నా కష్టాలన్ని పోతాయా? నా రోగాలన్ని నయమవుతాయా? నాకు అన్ని కలిసి వస్తాయా? లోకభోగాలన్ని నేను అనుభవించగలనా? అని అలోచించుకొనట్లేదా? యేసుక్రీస్తు ఏదో చేస్తాడని ఆశించి ఆయనపై మనము చూపే ప్రేమ స్వార్ధపూరితమైనది కాదా?

మూడవదిగా, యేసుక్రీస్తు ప్రేమ త్వరగా కోపపడదు. అస్సలు కోపపడదు అని వ్రాయబడలేదు కాని త్వరగా కోపపడదు అని వ్రాయబడినది. యేసుక్రీస్తు కోపము అర్ధవంతమైనది మరియు మనలను కీడు నుండి తప్పించాలనుకొనేది. ఆనాటి వ్యక్తులు దేవుని ఆలయమును వ్యాపారపు స్థలము (మోసము జరిగే చోటు) గా మారుస్తుంటే యేసుక్రీస్తు కోపపడ్డాడు. వారి రూకలు చల్లివేసి వాళ్ళందరిని చెదరగొట్టాడు. దేవుని సన్నిధి సంపూర్ణ సంతోషం ఉండే చోటు కాని మోసాలు జరిగే చోటు కాదు అని మనకు తెలుసు కదా. అలాగైతే వారిపై యేసు చూపిన కోపములో అర్థం ఉన్నది కదా. అంతేకాదు ఎవరైన వ్యక్తులు తప్పులు ఎమైనా చేస్తే మనకు ఎంతో త్వరగా కోపము వస్తుంది కదూ. మరి మనము ఒక్క రోజులో ఎన్నో పాపాలు చేస్తున్నామో కదా? మరి మనలను ప్రేమిస్తున్న యేసయ్య మన మీద త్వరగా కోపపడుతున్నాడా? మనపై ఉన్న ప్రేమతో మన జీవితాలలో మరొక్క రోజు పొడిగించి మనకు అవకాశం ఇవ్వట్లేదా? ఎందుకు ఆ అవకాశాన్ని మనము దుర్వినియోగము చేసికొంటున్నామో ఒక్కసారి అలోచించగలరా ప్రియ నేస్తమా?

చివరిగా, యేసుక్రీస్తు ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అది కల్మషము ఎంత మాత్రము లేని స్వచ్చమైన ప్రేమ. అనాటి జనాంగము ఆయనను సిలువ వేస్తే ఆ అపకారమును మనస్సులో పెట్టుకొనక "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" అని ప్రార్థించిన ప్రేమామయునిలో స్వచ్చత కనబడుటలేదా? కాని మనస్సులో కల్మషము పెట్టుకొని ఒక వ్యక్తి చెంతకు నేటి కాలపు ప్రేమలు చేరట్లేదంటారా? ఒక వ్యక్తిని మనము ప్రేమిస్తే ఆ వ్యక్తి చేసిన కీడును కూడా క్షమించగలిగేటంత గొప్ప మనస్సులు మనకు ఉన్నాయా? ఆ వ్యక్తి చేసిన అపకారమునకు ఖచ్చితముగా బదులు తీర్చుకొనేటంతవరకు నిద్ర సైతము మాని అవకాశము కోసము కాచుకొని ఉంటున్నాము కదూ. ఒక్క మాటలో చెప్పవలెనంటే యేసయ్యలాగా మనము ప్రేమించవలెనంటే జీవితకాలము పడుతుందేమో? అయినా ఫర్వాలేదు. ఈ రోజే మనము యేసయ్యలాగ ప్రేమించుటకు మొదటి అడుగు వేద్దామా?


మీకు ఈ అర్టికల్ నచ్చినట్లయితే మీ జీవితానికి అన్వయించుకొనండి. ప్రార్థించండి. Share చేయండి.మీ అభిప్రాయాలను నాకు తప్పనిసరిగా తెలియజేయండి. చాలా ప్రోత్సాహకరముగా ఉంటుంది. D.Pradeep Kumar 9849555496
మొదటి భాగము కొరకు http://4teluguchristians.blogspot.in/

Wednesday, February 18, 2015

ఆత్మఫలము: 1. ప్రేమ (మొదటిభాగము)

ప్రేమ అనేది హృదయమందు కలిగే గొప్ప అనుభూతి. మాటలతో చెప్పలేను గాని అనుభవించి తీరవలసిన మధురమైన భావన ఇది. ఈ లోకములో ఎన్ని రకాల ప్రేమలున్నను అవేవి శాశ్వతమైనవి కావు అనే విషయము యేసుక్రీస్తు ప్రేమ రుచి చూసిన ప్రతి హృదయము నొక్కి వక్కాణిస్తుంది. 1 కొరింథీ 13:4 ప్రకారము

 యేసుక్రీస్తు ప్రేమ దీర్ఘకాలము సహించును. కొంత కాలము సహించి విసుగెత్తి విడిచే ప్రేమ కాదు యేసయ్యది. మనమందరము ఎన్నో సార్లు తొట్రుపడలేదా? ఆయన నామమునకు అవమానము తీసుకొని రాలేదా? ఆయన మనల్ని అప్పుడు సహించలేదా? ఇప్పటికి సహిస్తున్నాడు కదా. అర్థం చేసుకోలేవా ప్రియ నేస్తం.

 యేసుక్రీస్తు ప్రేమ దయ చూపించును. మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక నరకాగ్నికి పాత్రులమై ఉంటే మనము నశించిపోవుట ఆయనకు ఇష్టములేక మనకు రావలిసిన పాపశిక్షను దయతో ఆయన భరించి మనకు స్వాతంత్ర్యము అనుగ్రహించ లేదా? ఇంతకన్న దయామయుడైన వ్యక్తియొక్క (పాపికోసం ప్రాణం పెట్టే అంత గొప్ప) ప్రేమను మీ జీవితంలో ఎప్పుడైనా చూశారా?

 యేసుక్రీస్తు ప్రేమ మత్సరపడదు. అనగా అసూయ చెందదు. యేసుక్రీస్తు తన బిడ్డలను ఆశీర్వదించాలని ఎప్పుడు చేతులు చాచేవాడే కాని నీ ఆశీర్వాదాలు చూసి అసూయపడే వాడు కాడు. నీ మరణము తరువాత నిన్ను పరలోకములోని బంగారు వీధులలో తిప్పవలెనన్న ప్రేమలో ఎక్కడ మత్సరము ఉందో కాస్తా చెప్పగలరా నేస్తమా? 

యేసుక్రీస్తు ప్రేమ డంబముగా ప్రవర్తించదు. యేసుక్రీస్తు మనపై ఉన్న ప్రేమతో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్నుతాను రిక్తునిగా చేసికొనెను. మీకు తెలిసిన ప్రేమలలో ఎన్ని ప్రేమలు తమది చాల గొప్పస్థితి అని డంబాలు పలుకకుండ ఉంటున్నాయో చెప్ప గలరా? మరి అలాంటప్పుడు యేసు ప్రేమను అర్థం చేసుకోవటానికి ఎందుకు వెనుకాడుచున్నారు?

 చివరిగా, యేసుక్రీస్తు ప్రేమ ఉప్పొంగదు. అన్ని నీకు మంచి చేస్తేనే ఒక వ్యక్తిని నీవు ప్రేమించగలవు. ఒకవేళ నీకు కీడు చేస్తే...? అనగా మనుష్యుని ప్రేమ ఒక రోజు ఒక రకముగాను మరొక రోజు మరొక రకముగాను ఉప్పొంగిపోయేదిగా ఉంటుంది కదూ. కాని యేసయ్య నీవు బాగుగా ఉన్నను నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు బాగుగా లేకపోయినను ప్రేమిస్తున్నాడు. ఆ విధముగా ప్రేమించే యేసయ్య నీ హృదయములో కొంచెము స్థానము అడుగుచున్నాడు. ఇవ్వాలనుకుంటే నీ దగ్గరలోని ఏ చర్చికైన వెళ్ళండి. దైవజనుని కలవండి. ఆయన మరికొన్ని దేవుని మాటలతో మీ తీర్మానాన్ని బలపడేటట్లు సహాయం చేయగలరు. తప్పని సరిగా వెళ్తారు కదూ...

 మీకు ఈ అర్టికల్ నచ్చినట్లయితే మీ జీవితానికి అన్వయించుకొనండి. ప్రార్థించండి. Share చేయండి.మీ అభిప్రాయాలను నాకు తప్పనిసరిగా తెలియజేయండి. చాలా ప్రోత్సాహకరముగా ఉంటుంది. D.Pradeep Kumar 9849555496