మొదటి భాగములో యేసుక్రీస్తు ప్రేమలోని 5 విషయములను ధ్యానించితిమి. అవేవనగా యేసుక్రీస్తు ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు మరియు ఉప్పొంగదు. ఈ రెండవ భాగములో మరో 4 విషయములను తెలిసికొనెదము. 1 కొరింథీ 13:5 ప్రకారము
మొదటిగా, యేసుక్రీస్తు ప్రేమ అమర్యాదగా నడువదు. ఆయన జీవించిన 33 1/2 సంవత్సరాల కాలములో ఎక్కడ కూడాను అమర్యాదగా ప్రవర్తించటం కనబడదు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనను స్థాపించగలడా అని ఆయన వేసిన ప్రశ్నకు నేటివరకును సమాధానము లేదు. ఇక ముందు కూడా సమాధానము రాదు. అత్యున్నతమైన ప్రేమ గలిగిన యేసుక్రీస్తే అంత మర్యాదగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయనను నమ్ముకున్నామని చెప్పుకొనే నేటి విశ్వాసులు ఎదుటివాని యెడల ఎందుకు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు?
రెండవదిగా, యేసుక్రీస్తు ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రియ నేస్తమా! ఒక్కసారి అలోచించండి...ఒకవేళ యేసుక్రీస్తు గనుక "ఈ పాపియైన వ్యక్తి కొరకు నా ప్రాణం నేను ఎందుకు పెట్టాలి. ఈ పని చేస్తే నాకు ఒరిగేదేమిటి?" అని తన ప్రయోజనము గురించి ఆలోచిస్తే ఈ మానవాళికి ఏమి జరుగుతుంది? ఒక్క ఆత్మ అయిన పరలోకం చేరుతుందా. 100% చేరనే చేరదు కదా. విచిత్రమైన విషయమేమనగా తన ప్రయోజనము ఎంత మాత్రమును ఆశించకుండా యేసుక్రీస్తు మనలను ప్రేమిస్తుంటే నేటి వ్యక్తులు యేసు క్రీస్తు దగ్గరకు వస్తే నాకు ప్రయోజనము ఎమిటి? నా కష్టాలన్ని పోతాయా? నా రోగాలన్ని నయమవుతాయా? నాకు అన్ని కలిసి వస్తాయా? లోకభోగాలన్ని నేను అనుభవించగలనా? అని అలోచించుకొనట్లేదా? యేసుక్రీస్తు ఏదో చేస్తాడని ఆశించి ఆయనపై మనము చూపే ప్రేమ స్వార్ధపూరితమైనది కాదా?
మూడవదిగా, యేసుక్రీస్తు ప్రేమ త్వరగా కోపపడదు. అస్సలు కోపపడదు అని వ్రాయబడలేదు కాని త్వరగా కోపపడదు అని వ్రాయబడినది. యేసుక్రీస్తు కోపము అర్ధవంతమైనది మరియు మనలను కీడు నుండి తప్పించాలనుకొనేది. ఆనాటి వ్యక్తులు దేవుని ఆలయమును వ్యాపారపు స్థలము (మోసము జరిగే చోటు) గా మారుస్తుంటే యేసుక్రీస్తు కోపపడ్డాడు. వారి రూకలు చల్లివేసి వాళ్ళందరిని చెదరగొట్టాడు. దేవుని సన్నిధి సంపూర్ణ సంతోషం ఉండే చోటు కాని మోసాలు జరిగే చోటు కాదు అని మనకు తెలుసు కదా. అలాగైతే వారిపై యేసు చూపిన కోపములో అర్థం ఉన్నది కదా. అంతేకాదు ఎవరైన వ్యక్తులు తప్పులు ఎమైనా చేస్తే మనకు ఎంతో త్వరగా కోపము వస్తుంది కదూ. మరి మనము ఒక్క రోజులో ఎన్నో పాపాలు చేస్తున్నామో కదా? మరి మనలను ప్రేమిస్తున్న యేసయ్య మన మీద త్వరగా కోపపడుతున్నాడా? మనపై ఉన్న ప్రేమతో మన జీవితాలలో మరొక్క రోజు పొడిగించి మనకు అవకాశం ఇవ్వట్లేదా? ఎందుకు ఆ అవకాశాన్ని మనము దుర్వినియోగము చేసికొంటున్నామో ఒక్కసారి అలోచించగలరా ప్రియ నేస్తమా?
చివరిగా, యేసుక్రీస్తు ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అది కల్మషము ఎంత మాత్రము లేని స్వచ్చమైన ప్రేమ. అనాటి జనాంగము ఆయనను సిలువ వేస్తే ఆ అపకారమును మనస్సులో పెట్టుకొనక "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" అని ప్రార్థించిన ప్రేమామయునిలో స్వచ్చత కనబడుటలేదా? కాని మనస్సులో కల్మషము పెట్టుకొని ఒక వ్యక్తి చెంతకు నేటి కాలపు ప్రేమలు చేరట్లేదంటారా? ఒక వ్యక్తిని మనము ప్రేమిస్తే ఆ వ్యక్తి చేసిన కీడును కూడా క్షమించగలిగేటంత గొప్ప మనస్సులు మనకు ఉన్నాయా? ఆ వ్యక్తి చేసిన అపకారమునకు ఖచ్చితముగా బదులు తీర్చుకొనేటంతవరకు నిద్ర సైతము మాని అవకాశము కోసము కాచుకొని ఉంటున్నాము కదూ. ఒక్క మాటలో చెప్పవలెనంటే యేసయ్యలాగా మనము ప్రేమించవలెనంటే జీవితకాలము పడుతుందేమో? అయినా ఫర్వాలేదు. ఈ రోజే మనము యేసయ్యలాగ ప్రేమించుటకు మొదటి అడుగు వేద్దామా?
మీకు ఈ అర్టికల్ నచ్చినట్లయితే మీ జీవితానికి అన్వయించుకొనండి. ప్రార్థించండి. Share చేయండి.మీ అభిప్రాయాలను నాకు తప్పనిసరిగా తెలియజేయండి. చాలా ప్రోత్సాహకరముగా ఉంటుంది. D.Pradeep Kumar 9849555496
మొదటి భాగము కొరకు http://4teluguchristians.blogspot.in/
No comments:
Post a Comment