Friday, February 20, 2015

ఆత్మ ఫలము: 1. ప్రేమ (ఆఖరి భాగము)

రెండవ భాగములో యేసుక్రీస్తు ప్రేమలోని 4 విషయములను ధ్యానించగలిగాము. అవేవనగా యేసుక్రీస్తు ప్రేమ అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; మరియు అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఈ ఆఖరి భాగములో ఆరు విషయములను తెలిసికొనెదము. 1 కొరింథీ 13:6-8 ప్రకారము

మొదటిగా, యేసుక్రీస్తు ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. చిన్న పిల్లలంటే తల్లితండ్రులకు చాలా ఇష్టం కదూ. కాని వారి ఎదైనా తప్పు చేస్తే తల్లితండ్రులు మౌనముగా కూర్చోలేరు కదూ. యేసుక్రీస్తు మనస్సు కూడా మనము త్రోవ తప్పిపోతే ఎంతో బాధపడుతుంది. కాపరి తప్పిపోయిన గొర్రెను మందలోకి చేర్చుటకు ఎంతగానో కష్టపడి వెదకి ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషించి దానిని మరల మందలో చేర్చినట్లు యేసుక్రీస్తు కూడా మనము తప్పిపోయినప్పుడు మనం ఎదుర్కొనబోయే దుస్థితిని గుర్తించి కన్నీటితో మనగురించి ఎదురుచూస్తూ మనం వచ్చినప్పుడు చెప్పనశక్యమైన సంతోషముతో మనల్ని తన అక్కున చేర్చుకొంటున్నారు. ఈ విషయం నేటి సమాజము ఎప్పుడు అర్థం చేసికొంటుంది?

రెండవదిగా, యేసుక్రీస్తు ప్రేమ అన్నిటికి తాళును లేక అన్నిటిని కప్పును. మనము చేసే విస్తార దోషములను యేసుప్రేమ కాక మరి యేదైనా ప్రేమ కప్పగలదా? ఆదాము హవ్వలు కేవలం దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వినకపోతే ఎంతో శిక్ష రాలేదా? మరి నేటి కాలములో విశ్వాసులమని పిలువబడే మనము దేవుని ఆజ్ఞలను ఎన్ని పాటిస్తున్నామో ఒక్కసారి ఆలోచించి చెప్పండి. అలాగైతే ఎంత శిక్షను మనము అనుభవించాలో కదా. కాని కృపామయుడైన యేసయ్య మనకు రావల్సిన పాపశిక్షను తాను శిలువలో భరించి తన రక్తముతో తుడవలేదా? ఇది గుర్తెరిగిన హృదయము ఆయనను స్తుతించకుండా మౌనముగా ఎలా ఉండగలదు?

మూడవదిగా, యేసుక్రీస్తు ప్రేమ అన్నిటిని నమ్మును. యేసుక్రీస్తు చెంతకు దుడుకు పేతురు వచ్చాడు. అనుమానపు తోమా వచ్చాడు. ఉరిమెడివారైన జెబదయి కుమారులు వచ్చారు. ధనాశ గలిగిన యూదా ఇస్కరియోతు వచ్చాడు. వీరి గురించి యేసుక్రీస్తుకు ముందుగానే తెలియదా? కాని వీరిని ఎలా నమ్మాడు? ఆయన వీరిని ప్రేమించాడు తత్ఫలితముగా వీరిని నమ్మాడు. మరి మనము కూడా యేసుక్రీస్తు చెంతకు వచ్చినప్పుడు చాల తీర్మానములు చేసికొనినప్పుడు ఆయన కూడా మనలను నమ్మి మన తీర్మానాలను బలపరచలేదా? కాని కాలక్రమములో ఆ తీర్మానాలను మనము ప్రక్కనబెట్టి మనకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఆయనకు (యూదా ఇస్కరియోతు లాగా) నమ్మకద్రోహము చేయట్లేదా. ఒక్కసారి ఆలోచిద్దామా ప్రియ నేస్తమా ఈ సమయములో...

నాల్గవదిగా, యేసుక్రీస్తు ప్రేమ అన్నిటిని నిరీక్షించును. తప్పిపోయిన తన కుమారుడు వచ్చేవరకు తండ్రి ఓపికతో ఎదురు చూచిన రీతిగా యేసుక్రీస్తు కూడా లోబడనొల్లని ప్రజలవైపు తన చేతులు చాపుచున్నాడు. వ్యవసాయకుడు విత్తనములు చల్లి పంటకొరకు కనిపెట్టుకొనినట్లుగా యేసుక్రీస్తుకూడా వాక్యమనే విత్తనములు చల్లి మనలో ఫలములకొరకు నిరీక్షిస్తున్నాడు. ఎంత వరకు ఆయన మనకొరకు నిరీక్షిస్తాడు? ఆయన రెండవ రాకడ లేక మన మరణము వరకు. ఎంతో అతృతతో ఎదురుచూస్తున్న యేసయ్యను తమ స్వరక్షకునిగా అంగీకరించకుండా ఎందుకు వాయిదాలు వేస్తారు. ఎంతకాలము ఆత్మ ఫలము ఫలించకుండా ఆయనకు కారుద్రాక్షలు మిగులుస్తారు? యోచించండి ప్లీజ్...

అయిదవదిగా, యేసుక్రీస్తు ప్రేమ అన్నిటిని ఓర్చును. ఆయనపై అన్యాయముగా అబద్దసాక్ష్యము పలికినప్పుడు ఆయన ఓర్చుకొనలేదా? ఒక నేరస్థునిగా అన్యాయపు తీర్పు తీర్చినప్పుడు ఓర్చుకొనలేదా? ముఖము మీద గ్రుద్ది, ఉమ్మివేసి మరియు వెంట్రుకలు పెరికినప్పుడు ఓర్చుకొనలేదా? 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఓర్చుకొనలేదా? సిలువపై ఘోరాతిఘోరముగా హింసించినప్పుడు ఓర్చుకొనలేదా? ఇంతటి అవమానమును నేటి ప్రేమలు ఎవైనా ఓర్చుకొనగలవంటారా?

చివరిగా, యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతకాలము ఉండును. నీవు పుట్టక మునుపే ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడు. నీవు తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఆయన ప్రేమించాడు. తల్లిగర్భములో నిన్ను రూపించి ఈ భూమి మీదకి తెచ్చి నీ పాదములకు రాయి తగులకుండా నీ అడుగు ఇరుకునబడకుండా అనగా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. నీవు మరణించిన తరువాత నీ ఆత్మను పరలోకము చేర్చుటకు ప్రేమతో ప్రయత్నిస్తున్నాడు. నీవు పుట్టిన దగ్గర నుండి మరణించేటంత వరకు ఎన్నో సార్లు ఆయనను బాధపెట్టి ఉంటావోకదా. ఇటువంటి బాధలు నేటి కాలపు ప్రేమలకు పెట్టి చూడండి. అవి బాధలు పెట్టే నిన్ను శాశ్వతకాలము ఓర్చుకుంటూ ప్రేమించగలవా. ఆలోచించండి. అశాశ్వతమైన ప్రేమలవైపు పరుగెడుతూ శాశ్వతమైన యేసుప్రేమను కాలదన్నుట న్యాయమా?

ప్రియ పాఠకా! మనము ఎవరము అలా ఉండవద్దు. యేసు ప్రేమను అర్థం చేసుకొన్నాము కదూ. ఈ చిన్ని ప్రార్థన చేద్దామా... ప్రేమ గల తండ్రి, దయ గల నాయనా, మీ పాదములకు స్తోత్రములు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమను అర్థము చేసికొనగలిగే అవకాశము మాకు ఇచ్చారు. మీకు స్తోత్రములు. యేసు మమ్మల్ని ప్రేమించిన రీతిగా మేము కూడా పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో మిమ్మల్ని మరియు మా పొరుగువారిని ప్రేమించే కృపను ఇవ్వమని బ్రతిమాలుకొనుచూ యేసుక్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రీ, ఆమేన్.

మీకు ఈ అర్టికల్ నచ్చినట్లయితే మీ జీవితానికి అన్వయించుకొనండి. ప్రార్థించండి. Share చేయండి.మీ అభిప్రాయాలను నాకు తప్పనిసరిగా తెలియజేయండి. చాలా ప్రోత్సాహకరముగా ఉంటుంది. D.Pradeep Kumar 9849555496

No comments:

Post a Comment