Monday, March 2, 2015

ఎందుకు అంత చింత!! ఎందుకు అంత భయం!!!

ప్రియ సహోదరా!! ప్రియ సహోదరి!!!
ఎందుకు అంత చింత!! ఎందుకు అంత భయం!!!

ముందు ఎర్రసముద్రం,
వెనుక ఫరో సైన్యం, 
నీవు నమ్మిన నీ ప్రభువు ఇశ్రాయేలీయులను నడిపించలేదా,
గమ్యస్థానమైన కనాను చేర్చలేదా.

ఎన్నో సంవత్సరాలనుండి మంచంపై పక్షవాయువుతో పడక,
బేతస్థ కోనేటిలో దించేవారు లేక,
నీవు నమ్మిన నీ ప్రభువు అతనిని దర్శించలేదా,
పాపక్షమాపణ పొంది స్వస్థచిత్తుడై తన పరుపెత్తుకొని నడువలేదా.

చిన్నలు మొదలుకొని పెద్దలవరకు చేతులలో రాళ్ళు,
ఎప్పుడెప్పుడు వేద్దామని ఎదురుచూస్తున్న కళ్ళు,
నీవు నమ్మిన నీ ప్రభువు రాళ్ళు వేయనిచ్చాడా,
పాపములో పట్టబడిన స్త్రీని క్షమించి సమాధానముతో ఇంటికి పంపలేదా.

విశ్వాసముతో నీటిమీద నడక,
అంతలోనే గాలిని చూచి భయపడి మునక,
నీవు నమ్మిన నీ ప్రభువు పేతురు చేయి పట్టుకొని రక్షించలేదా,
అల్పవిశ్వాసి! ఎందుకు సందేహపడితివని హెచ్చరించలేదా?

ఇంకెందుకు ఆలస్యం. ఎంతకాలము వాయిదా.
నీ ప్రభువు వైపు చూస్తూ విశ్వాసముతో పని జరిగించు.
ఎడతెగక విసుగక నిత్యము పట్టుదలతో నీ ప్రభుని ప్రార్థించు.
దివారాత్రములు ఆనందించుచు నీ ప్రభుని మాటలు ధ్యానించు.
ఇమ్మానుయేలు నీ తోడుండగా చింత, బాధ, భయము జయించు.

ప్రియ సహోదరా!! ప్రియ సహోదరి!!!
ఎందుకు అంత చింత!! ఎందుకు అంత భయం!!!

No comments:

Post a Comment