Tuesday, June 22, 2010

విశ్వాసి కోపపడవచ్చునా?

కోపం అనేది పసిపిల్ల మొదలుకొని వృద్ధుని వరకు అందరు కలిగియుండే సహజ లక్షణం. కోపం ఆత్మీయ అభివృద్ధికి చాలా పెద్ద ఆటంకమే ఎందుకనగా ముంగోపి అధిక దుష్క్రియలు చేయును. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనుకొనే వ్యక్తి సత్క్రియలు చేస్తాడు. ముక్కు మీద కోపం గలిగిన విశ్వాసి యొక్క తలంపులు దుష్టమైనవిగా ఉంటాయి మరియు అతని క్రియలు కూడా కీడు కల్పించేవిగా ఉంటాయి. అందుకే కోపము మానుము. ఆగ్రహం విడిచిపెట్టుము. వ్యసనపడకుము. అది కీడునకే కారణము. ఒకవేళ సరిదిద్దే క్రమంలో కోపపడవలసి వస్తే కోపపడుడి కాని పాపం చేయకుడి. మీ కోపం సూర్యుడు అస్థమించు వరకు నిలిచియుండకూడదు.
            ఆది తల్లితండ్రులైన ఆదాము హవ్వలు యొక్క కుమారులు:కయీను మరియు హేబెలు. కయీను భూమిని సేద్యపరుచువాడు. హేబెలు గొర్రెల కాపరి. కొంతకాలమైన తరువాత కయీను పొలపుపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలిచూలున పుట్టినవాటిలో క్రొవ్వినవాటిని కొన్ని తెచ్చెను. దేవుడు మనము తెచ్చే అర్పణల కంటే మన హృదయాలను అధికంగా లక్ష్యపెడతాడు. మన హృదయాలు ఆయన మాటలను లక్ష్యం చేయకుండ దుష్టంగా ప్రవర్తించినంతకాలం మన అర్పణలు ఆయనకు ఆమోదయోగ్యమైనవి కావు. అందుకే కాబోలు దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు; హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు.
            కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనును చూచి- నీకు ఆగ్రహమేల? ముఖము చిన్నబుచ్చుకొనియున్నావేమి? నీవు సత్క్రియ చేసినయెడల సంతోషముగా నుందువు గదా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని యేలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతని చంపెను.కయీను తాను చేసినది యెవ్వరు (తన తల్లిదండ్రులు) చూడలేదులే అని అనుకొనియుండవచ్చును. కాని తాను చేసిన పనిని దేవుడు చూశాడు. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆయన అన్నిటిని యెరిగనవాడై యున్నాడు. కాబట్టి యెహోవా- నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా అతడు- నేనెరుగను; నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. దుష్టుడు మరియు వాని సంబంధీకులందరు చేసిన అతిక్రమాలను ఒప్పుకొనరు సరికదా మతి భ్రమించిన సమాధానాలు చెబుతారు. అప్పుడాయన- నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తముయొక్క స్వరము నేలలొనుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు; నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇకమీదట నీకియ్యదు; నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అయ్యో! కయీను కోపంతో చేసిన పని అతను భరించలేనంత శిక్షకు దారితీసినది.
            దీనినిబట్టి చూస్తే ప్రియపాఠకా! మనము కోపము విడిచిపెట్టుట మన ఆత్మీయ జీవితాలకు ఉత్తమం. లేకపోతే మనకు దేవునికి మధ్య సంబంధం నశించిపోగలదు. ఒకవేళ కోపపడవలసి వస్తే అది అర్ధవంతముగా ఉంటూ ఇతరులను బాగుచేయగలిగెదిగా ఉంటే ఎంతో శ్రేయస్కరం.
మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే ప్లీజ్... మీ వ్యక్తిగత ప్రార్ధనలో ఈ బ్లాగు గురించి ఙ్ఞాపకం చేసికొనండి మరియు ఈ క్రింద ఒక కామెంట్ వ్రాయండి.

No comments:

Post a Comment