Tuesday, June 22, 2010

గర్వం దేవునితో మనకు గల సంబంధాన్ని పాడుచేస్తుందా?

ప్రతి పని చేయుటకు సామర్ద్యము మరియు ఙ్ఞానము ఇచ్చినది దేవుడే. కార్యము పూర్తి కాగానే ఆయనను మరచి తనని తాను గొప్ప చేసుకొంటూ (మనసులో మరియు బయట) ప్రవర్తించే విధానమే గర్వాన్ని సూచిస్తున్నది. ఈ గర్వము ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఒకప్పుడు దేవుని స్తుతించి మనసున గర్వించినందుకు లూసిఫర్ అనే దేవదూత తన పరలోకపు స్థానాన్ని కొల్పోలేదా. భూమి మీదకు త్రోయబడి అనగా తాను నాశనమైనదే కాకుండా, భవిష్యత్తులొ తాను ఉండబోయే నరకంలోకి అనేకులు వచ్చునట్లు వారి వారి జీవితాలను నాశనం చేయట్లేదా.
            దేవుని నివాసమగు ఆలయములో ఉన్న ఉపకరణములు దేవుని పని నిమిత్తమే వాడబడాలి. బెల్షస్సరు అనే రాజు తన అధిపతులకు, తన రాణులకు మరియు తన ఉపపత్నులకు విందు యేర్పాటు చేశాడు. తన అధికార బలంతో గర్వించి దేవుని నివాసమగు ఆలయములో ఉన్న ఉపకరణములను తెప్పించి వాటిలొ ద్రాక్షారసం పోయించి త్రాగాడు. గర్వం ఎదుటి వ్యక్తి యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయునంతగా కన్నులకు గ్రుడ్డితనం కలుగ చేస్తుంది కాబోలు. బెల్షస్సరు యొక్క గర్వం ఫలితంగా అతడు ఆ రోజు రాత్రే హతుడయ్యాడు (దానియేలు 5వ అధ్యాయం).
            దీనిని బట్టి చూస్తే ప్రియ పాఠకా!గర్వమనేది దేవునితో మనకు గల సంబంధానికి పెద్ద ఆటంకముగా కనబడుతున్నది. కాబట్టి ఇప్పుడు మనమున్న స్థితిని బట్టి దేవుని స్తుతిద్దాం. మనం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినను గర్వపడక మనల్ని మనం తగ్గించుకొంటూ మన స్థితికి కారణమైన దేవునిని హెచ్చిద్దాం. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును.
మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే ప్లీజ్... మీ వ్యక్తిగత ప్రార్ధనలో ఈ బ్లాగు గురించి ఙ్ఞాపకం చేసికొనండి మరియు ఈ క్రింద ఒక కామెంట్ వ్రాయండి.

No comments:

Post a Comment