Tuesday, June 22, 2010

సోమరితనము ఆత్మీయ అభివృద్ధికి ఒక పెద్ద ఆటంకమా?

సోమరితనం అనగా చేయవలసిన పనిని చేయకుండా వాయిదా వేయటం లేక మధ్యలోనే ఆపివేయటం. చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే, ఇంకా కొంచెంసేపు కునుకు తీద్దాం వంటి భావనలు సోమరితనాన్ని సూచిస్తున్నాయి. ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో అనుదినం చేయవలసినవి: ప్రార్ధన చేయుట (క్రీస్తుతో మాట్లాడుట), బైబిల్ చదివి దేవుని మాటలను తన జీవితానికి అన్వయించుకొనుట (క్రీస్తు మాటలు ఆచరించుట) మరియు తాను ఘనపరుస్తూ క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయుట. ఒక విశ్వాసి ఇవేమి చేయకుండా వేరే పనులలో నిమగ్నమై ఉన్నా లేక వీటిని ఆసక్తిగా కాక ఒకవేళ మ్రొక్కుబడిగా చేసినా తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడనే లేక శక్తిలేని భక్తి చేస్తున్నాడనే చెప్పాలి.
            యుద్ధము జరుగుచున్నప్పుడు రాజు యుద్ధమునకు వెళ్ళాలి.యుద్ధమునకు వెళ్ళవలసిన దావీదు వెళ్ళకుండ బద్ధకించి తన మిద్దె మీద నుండి స్నానం చేస్తున్న ఊరియా భార్య అయిన బత్షెబని చూసి, ఆమెని పిలిపించి, ఆమెతో శయనించాడు. అంత మాత్రమే కాదు, ఊరియా కొట్టబడి హతమగునట్లు యుద్ధము మోపుగా జరుగుచున్నచోట అతనిని ఉంచమని యోవాబుకి ఉత్తరం వ్రాశాడు. తన పధకం ప్రకారం ఊరియా హతమవ్వగానే అతని భార్యని తన భార్యగ చేసుకొన్నాడు. తన అత్మీయ జీవితంలొ ఒక మచ్చ తెచ్చుకొన్నాడు. దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు(2సమూ 11వ అధ్యాయం).
            దీనిని బట్టి చూస్తే ప్రియ పాఠకా! ఒకవేళ ఈ సోమరితనమనే ఆటంకం వచ్చిందని గుర్తించినట్లయితే వాక్యపు వెలుగులో సరిచేసుకొని క్రీస్తుకి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం ఉత్తమం మరియు మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుట ఆశీర్వాదకరం.
మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే ప్లీజ్... మీ వ్యక్తిగత ప్రార్ధనలో ఈ బ్లాగు గురించి ఙ్ఞాపకం చేసికొనండి మరియు ఈ క్రింద ఒక కామెంట్ వ్రాయండి.

No comments:

Post a Comment