అసూయ అనగా ఎదుటి వ్యక్తి యొక్క గొప్ప స్థితిని చూసి ఓర్చుకొనలేకపోవుట.ఎదుటి వ్యక్తి యొక్క గొప్ప స్థితికి మనం కూడా చేరాలనుకొని మంచి ప్రయత్నం చేయటంలొ తప్పు లేదు కాని ఆ వ్యక్తి మీద అసూయతో బురద జల్లుట మరియు ఆ స్థితి నుండి పడగొట్టాలని ప్రయత్నించుట మనలను ఆత్మీయంగా గొప్ప స్థితికి తీసుకొని వెళ్ళదు కాని ఆత్మీయంగా దిగజారుస్తుంది.
బాలుడైన దావీదు దేవుని యందలి విశ్వాసమును ఆధారము చేసుకొని ఆజానుబాహుడైన గొల్యాతును జయించి ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలో నుండి తంబురలతోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు -" సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతముచేసిరనిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని- వారు దావీదుకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప ఎమి అతడు తీసికొనగలడు అనుకొనెను. కాబట్టి నాటనుండి సౌలు (దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తి) దావీదుమీద విషపుచూపు (అసూయకు ప్రారంభం) నిలిపెను(1సమూ 18:6-9). ఆ తరువాత అవకాశం చిక్కినప్పుడెల్ల దావీదును చంపుటకు (అసూయ విచక్షణను కోల్పోయేలా చేసి ఏ పనైన చేయిస్తుంది) ప్రయత్నించాడు. దేవుడు చూస్తూ ఊరుకొంటాడా? దావీదుకు రాజ్యమును అప్పగించి సౌలును యుద్ధములొ శత్రువుల చేతికి అప్పగించాడు. అసూయ కలిగి ప్రవర్తించుట వలన సౌలు తన ఆత్మీయ జీవితాన్ని తానే చేతులారా నాశనం చెసికొన్నాడు.
దీనిని బట్టి చూస్తే ప్రియ పాఠకా!అసూయ అనేది కేన్సర్ వంటిదని స్పష్టమగుచున్నది.కాబట్టి మనకు ఏ వ్యక్తి మీద అసూయ కలుగుచున్నదో ఆ వ్యక్తిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మన హృదయములను దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకొంటూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకనగా అసూయ అనేది ఎదుటి వ్యక్తి కంటే అసూయ కలిగియున్న వ్యక్తినే నాశనం చేస్తుంది.
మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే ప్లీజ్... మీ వ్యక్తిగత ప్రార్ధనలో ఈ బ్లాగు గురించి ఙ్ఞాపకం చేసికొనండి మరియు ఈ క్రింద ఒక కామెంట్ వ్రాయండి.
No comments:
Post a Comment